Online Puja Services

రాముని భూమిని దక్కేలా చేసిన శ్రీ రామభద్రాచార్య ఎవరు?

13.59.195.118

రాముని భూమిని దక్కేలా చేసిన శ్రీ రామభద్రాచార్య ఎవరు? | Who is Sri Ramabhadracharya? 
లక్ష్మీ రమణ. 

ద్రుష్టి అనేది లౌకికమైన శరీర చక్షువులకి సంబంధించినది కాదు.  అది శరీరానికి అతీతమైన ఆధ్యాత్మిక శక్తిని సంబంధించినది.  చూడగలిగే మనసుంటే జగమంతా రామమయమవుతుంది.  విజ్ఞాన విపంచిగా మారుతుంది అని నిరూపించిన మహా జగద్గురువులు గురుదేవ్ శ్రీ రామభద్రాచార్య.  చర్మ చక్షువులని కేవలం రెండు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే కోల్పోయారు.  అయినా ఆయన దాదాపు 230 పుస్తకాలు రచించడమే కాకుండా, శ్రీరామ జన్మభూమి వివాదంలో, ఆ భూమి శ్రీరామునిదే అని నిరూపించే దాదాపు 441 సాక్ష్యాధారాలని కోర్టుకి సమర్పించారు.  వాటిలో 437 సాక్ష్యాలని కోర్టు అంగీకరించడం విశేషం.    

300 మంది న్యాయవాదులతో నిండిన కోర్టు.  ప్రత్యర్ధులేమీ సామాన్యులు కాదు. అంగబలం , అర్థబలం కలిగినవారు.  అయినా శ్రీరాముని తోడు ఉండగా బెరుకేముంది.  శ్రీ రామ రక్షా సర్వజగద్రక్ష కదా ! చూపు లేకపోయినా, అంతర్నేత్రంతో సదా  రాముని దర్శించే మహద్భాగ్య కలిగాక, ఇక చూపు లేదనే మాటే లేదుకదా ! రాముని తరఫున, రామ జన్మభూమి కోసం తపిస్తున్న కోటానుకోట్ల హిందూ జాతి తరఫున గురుదేవ్ నిలబడ్డారు. 

ప్రత్యర్ధి న్యాయవాది ప్రశ్నల పరంపర వదిలారు. రామునిపై రాయిలా ? అడ్డుకొనేందుకు గురుదేవ్ రాముడే తోడుగా ప్రతి రాయినీ ఒక సిక్సర్ గా మలిచారు.  మొదట న్యాయవాది రామచరిత్ మానస్‌లో రామజన్మభూమి ప్రస్తావన ఏమైనా ఉందా? అని అడిగారు.  అప్పుడు గురుదేవ్ శ్రీ రామభద్రాచార్య వారు  శ్రీ రామజన్మభూమి ప్రస్తావన ఉన్న భక్త తులసీదాస్ చాపాయిని వివరించారు. 

ఆ తర్వాత  ‘శ్రీరాముడు ఇక్కడే పుట్టాడనడానికి వేదాల్లో ఏవైనా ఆధారాలున్నాయా ?’ అని మరో ప్రశ్న వేశారు.  సమాధానంగా శ్రీరామభద్రాచార్యజీ అథర్వవేదంలోని రెండవ మంత్రం దశమ కాండలోని  31వ అనువాకం అందుకు నిదర్శనమని  చక్కగా  వివరించి మరీ చెప్పారు. ఆ వివరణ విన్న  ముస్లిం జడ్జి బెంచ్, "స్వామీ , మీరు ఒక దివ్యమైన ఆత్మ" ని నమస్కరించారు. 

ఆ తర్వాత రాముడు పుట్టనే లేదని సోనియాగాంధీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు, శ్రీ రాంభద్రాచార్య స్వామి  నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కి “మీ గురుగ్రంథ సాహిబ్‌లో రాముడి పేరు 5600 సార్లు ప్రస్తావించబడింది” అని రాశారు. ఇదంతా ప్రముఖ టీవీ ఛానల్ కు  శ్రీ రామభద్రాచార్య వారు  చెప్పారు. 

రాముని జనం  రామ మందిరాన్ని నిర్మించుకొని, ఆ రాముని   ప్రతిష్ఠించుకొని పూజించుకోగలుగుతున్నామంటే అది  ఇటువంటి మహానుభావులైన ఎందరో దివ్య పురుషుల అనుగ్రహం.  విశేషించి శ్రీ రామభద్రాచార్య గురుదేవులు దైవికమైన కృప తోడుగా లేకుంటే ఇంతటి అద్భుతాన్ని సాధ్యం చేయగలిగేవారేనా ? కేవలం ఇది మాత్రమే కాదు, ఆయన జీవితంలో ఇటువంటి ఎన్నో అద్భుతాల్ని చేసి చూపించారు శ్రీ రామభద్రాచార్య వారు. 

శ్రీ రాంభద్రాచార్య స్వామి 1950 జనవరి 14న ఉత్తరప్రదేశ్, జౌన్పూర్ జిల్లాలోని షాండిఖుర్ద్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పండిట్ రాజదేవ్ మిశ్రా, శచీదేవి మిశ్రా.  జన్మ నామం గిరిధర్ మిశ్రా.  ఆయన 22 భాషలను మాట్లాడగలరు . సంస్కృత, హిందీ, అవధి, మైథిలి భాషలతో పాటు అనేక ఇతర భాషలలో ఆశు కవి, రచయిత కూడా . తులసీదాసు రామచరితమానస్, హనుమాన్ చాలీసా గ్రంథాలపై హిందీ వ్యాఖ్యానాలు, అష్టాధ్యాయ పద్యాలకు సంస్కృత వ్యాఖ్యానం, ప్రస్థానత్రయం గ్రంథాలపై సంస్కృత వ్యాఖ్యానాలతో సహా 100 కు పైగా పుస్తకాలని , 50కి పైగా  పత్రాలను రచించారు.  సంస్కృత వ్యాకరణం, న్యాయ, వేదాంతాలతో సహా విభిన్న రంగాలలో ఆయన పండితులు.  రామాయణం, భాగవత కథా కళాకారులు కూడా ! ఇవన్నీ కనులు లేకుండానే ఆయన సాధించిన అద్భుతాలు.  

ఒకసారి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ "నేను మీకు  చూపు తెప్పించే ఏర్పాటు చేయగలను" అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఈ మహనీయులు  "నాకు ప్రపంచాన్ని చూడాలని లేదు" అని సమాధానమిచ్చారు. పైగా ఆయన  “ నిత్యమూ శ్రీరాముణ్ణి దగ్గరగా దర్శించుకునే నేను అంధుణ్ణి ఎలా అవుతాను ? నేను అంధుడిని కాదు.  అని చెప్పారు. 

ఇటువంటి మహనీయులు ఈ కాలంలో ఉన్నారు. 75 ఏళ్ళ శ్రీ రాంభద్రాచార్య స్వామి మన కళ్ళముందున్న ఒక అద్భుతం .  వేలకోట్ల హిందువుల కలలని సానుకూలం చేసిన ఆ రామానుజాచార్యునికి, శ్రీ రాంభద్రాచార్య స్వామికి రామ సేవా దురంధరుడైన మహానుభావునికి పాదాభివందనం చేస్తూ శలవు. 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda